ennela.. lakshmi rayavarapu
ఆ. వె. వసంత ఋతువు
చిగురు తొడిగె పుడమి చిత్రరథము నెక్కి
కోరి పాడె నదిగొ కోకిలమ్మ
నిరుటి కోర్కెలన్ని నిజము గావించెను
కొత్త వత్సరమ్ము కోటి సిరుల
తే.గీ. గ్రీష్మ ఋతువు
అంచె లంచెల పెరిగెడి అగ్నిశిఖల
మేల మాడంగ భానుడు మెలపు తోడ
తపను వేడికి జనులెల్ల తల్లడిల్ల
పెంచె జ్యేష్టమాషాఢముల్ పెక్కు వెతలు
కం. వర్ష ఋతువు
వర్షము వచ్చెను మెరుపుల
హర్షము తెచ్చెను విడువక హరితపు ధరణిన్
కర్షక సోదరు లందరి
మర్షమునకు ఫలములొసగ మరువని సిరియై
మర్షము: ఓర్పు
సీసం. శరదృతువు
వెన్నెల సోనల వెలుగులు జల్లిన
పదియారు కళలెల్ల పట్టి దెచ్చి
కన్నుల వెలిగెడి కాటుక కాంతులు
గగనానికెగి రెడి గరిమ గూర్చి
అన్నుల మిన్నల అందాల నవ్వులు
అంబరానికి చేరు అదను చూసి
పొన్నలు పూసేటి పాలపుంతల దారి
పొగడ పువ్వుల వెల్గు పడగ జేసి
తే. గీ.
విరిసె నవనిలో శారదా వీక్షణములు
కురిసె నవకాంతి శోభలు కుశలముగను
మురియ మనుజులు దేవతా మూర్తులెల్ల
అరియగావెల్గి మెరిసెను ధరణి మాత
అరియ: సామ్రాజ్ఞి
ఉ.మా. హేమంత ఋతువు
జీవనధారయై వెలుగు జీకటి పోరుల చీరయంచుపై
త్రోవలభారమై నలిగి తోరపు ముత్తెపు తోరణమ్ములై
ఆవల తారలై మెరయు ఆణిసుధీరుల నెంచుచున్ మదిన్
భావగభీరమై చెలగె భారముగా
HimavEla ధాత్రిపై
చం. మా . శిశిర ఋతువు
ఎవరిని జూచి భీతిలుచు
నీగతి ఆకులు రాల్చుచుండెనో
చివరికి జాతి పోవునని చిప్పిలి మొక్కలు ఏడ్చు చుండెనో
కువకువ లాడుచున్ బెదరి గువ్వలు నెత్తరి చూచు చుండెనో
నవయుగ మెప్పుడో శిశిర
నైషిక మెన్నడు నాశ మొందునో
No comments:
Post a Comment