105 25062022
పాణం
......
చీకటి రాత్రి..
వీధి దీపాలు దీర్ఘనిద్రలో ఉన్నాయి.
ఒకటీ అరా వాహనాల రొద తప్ప నిశ్శబ్దంగా ఉంది.
రోడ్డు పక్క గోనెపట్టా చుట్టుకుని ముడుచుకుని ఉన్నాడు సింహాచలం.
ఆలోచిస్తున్నాడు.
ఇందాక రామేశంబాబు ఫోన్లో చెప్పినట్టు ఉల్లిపాయలలోడుతో లారీ రావాలి-
అందులో క్లీనరు ఇచ్చే ఒక పసిబిడ్డను తను తీసుకుని తన పాకెనకాల
సందులో రహస్యంగా కప్పెట్టాలి.
"జాగ్రత్త - పిట్ట మనిషికి తెలిసిందంటే నీ పీకెగిరిపోద్ది-"
హెచ్చరించాడు రామేశంబాబు.
వెదవది - పూటపూట తిండి దొరక్క ప్రాణం ఎగలాక్కుపోతోంది _
పీకమీద మమకారం తనకేటి లేదు కానైతే కీళ్ళవాతం పెళ్ళాం,
ముగ్గురూ ఆడబిడ్డలు.. ఎలా సాకాలో అదే దిగులు ఇద్దరికీ
ఏటై పోవాలి . ఎలా సాకాలో అదే దిగులు ఇద్దరికీ …
అదికాక పనిచేస్తే రామేశం బాబు ఏదోటి ముట్టచెప్పకపోడు - పిల్లాపెద్దా పదిరోజులు
కళ్ళుమూసుకు నిద్రపోవచ్చు.
సింహాచలం మరోసారి కళ్ళు చికిలించుకు రోడ్డు చివరకు
చూశాడు _ లారీ జాడ లేదు.
అసలింతకీ - అన్నెంపున్నెం ఎరుగని పసిబిడ్డను రహస్యంగా
పెట్టే అవసరం ఏంటో -
ఏమో ఆ పసికందెవరో - అయినింటి తల్లి కన్నులపంటో -
తనలాగే కూడు దొరకని యింటి వెలుగో -ఛ -వెదవాలోచన మళ్ళా -
కూడు దొరకనోళ్ళ పిల్లతో రామేశం బాబుకి పనేంటి - గొప్పోళ్ళ
పిల్లే అయుంటుంది - అసలిదంతా తనకెందుకంట - రామేశం
బాబు చెప్పిన పని చేసేసి పదిరోజులు కలో గంజో తాగి చల్లగా
పడుకోక ....
బోయ్ మన్న హారను తో ఈ లోకంలోకి వచ్చాడు సింహాచలం,
ఎదురుగా రామేశం బాబు. చేతుల్లో గుడ్డ మూటతో.
"చెప్పింది గుర్తుందిగా.. తేడా రాకుండా చూసుకో" అంటూ ఆ మూట
సింహాచలం కి ఇచ్చాడు.
"ఆయ్.. బాబు.. పాణం నేదుగా" అని సణిగాడు సింహాచలం.
"అదంతా ఎందుకు.. చెప్పినట్లు చెయ్.. అంతే... ఇంద" అంటూ చిన్న బొత్తి నోట్లు ఇచ్చి "జాగ్రత్త."
అని లారీ కేబిన్ ఎక్కేసాడు రామేశం బాబు.
పాకెనకాల తవ్వి ఉంచిన గొయ్యి దగ్గరకు పోయి.. గుడ్డ మూట పై గుడ్డ తీసాడు సింహాచలం.
కదిలినట్లు అనుమానం వచ్చి అన్ని తీసి చూసాడు.
పసిగుడ్డు అప్పుడే కళ్లిప్పి చూసింది.
ఏటి సేద్దారి...
ఆడబిడ్డే... పాణమున్న బిడ్డ.. నా నాలుగో కూతురు అనుకుంటూ గుడ్డలు మళ్ళి
కప్పాడు.
------------
-----------
వాట్సాప్ కథలు 855 13072024
కథ పేరు: బంధం
(జరిగిన సంఘటన ఆధారంగా)
రచన: విమలాప్రసాద్
బొమ్మ: లేదు
ఫోన్ రింగయింది. తీసి ఎవరా అని చూసాను. మేనల్లుడు విజయ్ చేసాడు.
"మామయ్యా..చిన్న హెల్ప్ చేయవూ..
వైజాగ్ లో మా ఫ్రెండ్ రాధేయ తెలుసుగా..తన ఫాదర్ పోయారు. నిన్న పదవరోజు అయిపోయింది. నేను వచ్చి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను.
సడెన్ గా మా బాస్ ఏదో అసైన్ మెంట్ చూడమన్నారు. నా జర్నీ కాన్సిల్ అయింది. ఎప్పుడు ఫ్రీ అవుతానో..
నీకు తెలుసుగా రాధేయ, వాడి ఫ్యామిలీ నన్నెంత బాగా చూసుకుంటారో.
ప్లీజ్ మామయ్యా ..ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి పలకరించి రావా.." ఇదీ విజయ్ మాటల సారాంశం.
"సరేలే..రేపు చూస్తాను. అడ్రస్ మెసేజ్ పెట్టు" అని ఫోన్ పెట్టేసాను.
సాయంకాలం టీ తాగాక చూస్తే వాడి ఏ మెసేజీ లేదు.
ఏమయి ఉంటుందా అని ఆలోచిస్తూ నేనే కాల్ చేయబోతూ ఉంటే అప్పుడు చేసాడు వాడే.
"సారీ మామయ్యా.. వాళ్ళ నాన్నగారు పోయినప్పటి నుండి వాళ్ళమ్మగారు పానిక్ గా ఉన్నారుట. అందుకని ఇంటికి ఎవరినీ రానివ్వటం లేదుట పరామర్శకు. ఫ్యూనరల్ జరిగిన చోటుకు తీసుకెళ్ళు. నా బదులు మామయ్య అంకుల్ కి దండం పెట్టి వస్తారు అని చెప్పాను. పొద్దున్నే వాడిచ్చిన అడ్రసు ఇస్తాను. వెళ్ళవా ప్లీజ్" అన్నాడు.
రెండు నిమిషాలు ఆలోచించి సుధతో చెప్పాను.. "పోనీ వెళ్ళండి. నేనూ వస్తాను. వీడి మనసులో అంత ఉంది కద" అంది తను.
ఇంక ఏముంది విజయ్ కి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
మర్నాడు ఉదయం పదికి విజయ్ అడ్రసు ఇచ్చి అక్కడకు వెళ్ళాక కాల్ చేస్తే రాధేయ వస్తాడు అని చెప్పాడు.
కారులో నేనూ, సుధా బయల్దేరి దోవలో స్వీట్లు పూలదండ తీసుకున్నాము.
చెప్పిన అడ్రసు దగ్గర ఆగి కాల్ చేయగానే రాధేయ వచ్చాడు. పాపం ఇటీవలే జరిగిన సంగతులేమో ఇంకా దిగులుగా కనిపించాడు. చూపించిన చోటులో తీసుకెళ్ళినవి పెట్టి ఆయన ఆత్మశాంతికి, నివాళికి నమస్కారించాము ఇద్దరం.
కొంచెం ఇవతలికి వచ్చి తల్లిదండ్రుల గురించి పరామర్శగా అడిగాము రాధేయని.
"అంతా సడెన్ గా జరిగిపోయింది అంకుల్.." అంటూ చెప్పాడు..
తండ్రి రిటైరయ్యాక ఇంట్లోనే ఉంటున్నారు.
ఏవో చిన్న హెల్త్ ఇష్యూలకు మెడిసిన్ వాడుతున్నారు.
తల్లి లోకల్ పొలిటికల్ పార్టీ ఎందులోనో యాక్టివ్ పర్సన్. అన్నిట్లో భర్త సహకారం తీసుకుంటారు.
ఇంట్లో ఇద్దరే. డబుల్ బెడ్ మీద పడుకుంటారు.
ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే మర్నాటి కార్యక్రమాలు,
రోజువారీ పనులు గరించి చర్చలు, కబుర్లు అయ్యాక పడుకున్నారు.
తెల్లవారి ఆయన లేవలేదు.
అందరు వచ్చి అన్నీ చూసినా ఆవిడకు గ్రహింపుకు రాలేదు. ఆయన పోయారనే విషయమే మనసుకు ఎక్కలేదు.
రాత్రి మాట్లాడుకున్న ట్రాన్స్ లోనే ఆవిడ మైండ్ అలా ఉండిపోయింది అన్నారు డాక్టర్లు.
అతిగా ఏవేవో అర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు, డిస్ట్రబ్ అవుతున్నారు అని తండ్రి గురించి పరామర్శలకు ఎవరినీ రావద్దన్నారు కొన్ని రోజులు.
నాన్నగారు వాడే మెడిసిన్ రియాక్షన్ వల్ల పోయారని తెలిసింది. అక్క మళ్ళీ వచ్చి కొన్నాళ్ళు ఉంటే సర్దుకుంటుంది అనుకుంటున్నాం అని ముగించాడు.
మనసు బరువుగా అయిపోయింది. కారెక్కాం.
"అంత కలిసి ఉన్న వారి బంధం ఎంత గాఢమో కద అండి" అంది సుధ.
"అవును. కొందరు అంతే" అనిపించింది నాకు కూడా.
----------
వాట్సాప్ కథలు: 862 20072014
కథ పేరు: స్నేహం
రచన: విమలాప్రసాద్
బొమ్మ: లేదు
.....
సిస్టమ్ ముందు ఉన్న రమేశ్ దగ్గరకు వచ్చాడు రవి.
"రాత్రి విశ్శు దగ్గర ఉంటావురా నువ్వు.."
"అదే చూస్తున్నాను. ఒక క్లయింట్ రమ్మన్నారు ఈవెనింగ్. ఆ పనయితే వెళ్తాను."
"సరే అయితే.. రేపు కాశ్యప్ ఉంటా అన్నాడు."
"హా.. ఏమిటోరా.. ఇంకా ఎన్నిరోజులు ఇలా వాడు.."
"ఏమి చేస్తాము.. వాళ్ళ అమ్మావాళ్ళు చూస్తున్నాము కద ఎంత బాధలో ఉన్నారో."
"అవునురా. ఒకడే కద విశ్శు వాళ్ళకి. పాపము."
"మనకు మాత్రము లేదా.. విశ్శు మనకు ఎంత క్లోజు."
ఇంతలో రమేశ్ ఫోన్ రింగయ్యింది.
గోవిందు.. రవికి చెప్పి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు రమేశ్.
వారి ఫ్రెండ్ విశ్శు - విశ్వం కార్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ఉన్నాడు.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కాని, మాములు స్ఠితికి రావడానికి చాలా సమయం పడుతుంది అన్నారు స్పెషలిస్ట్ లు.
తల్లీ, తండ్రీ చాలా ఆందోళనలో ఉన్నారు. తలకు మించిన ఖర్చు.. ఒకగానొక్క కొడుకు బాగుంటే చాలు అని అన్ని ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూరుస్తున్నారు. అయినా అంతూపొంతూ కనపడటం లేదు.
ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండవలసిన పరిస్థితి.
మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉందని ప్రమాదం గురించి వివరాలు చెప్పలేదు.
నాలుగేళ్ళ నుండి హైదరాబాద్ లో మిత్రులు నలుగురూ చిన్న గది తీసుకుని అన్నీ షేర్ చేసుకుంటూ గడుపుతున్నారు.
అందరివీ ఒకమాదిరి పనులే. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు పంపే డబ్బు జాగ్రత్తగా వాడుకుంటూ ఒకరికొకరు అన్నట్లు ఉంటున్నారు.
ముగ్గురు చిన్నప్పటి నుండీ ఫ్రెండ్స్ కాగా.. ఇంకొకరు కాలేజీ మిత్రుడు.
ఎవరికీ అరమరికలు లేవు.
పెద్దలు ఆర్ధికంగా బాగున్న వారే కాని, స్వంతంగా పని చేసుకోవాలనుకునే పిల్లలకు అడ్డు చెప్పకుండా వారి అభిరుచి ప్రకారమే ప్రోత్సాహిస్తూ ఉంటారు.
"గోవిందు అంటున్నాడురా.. వాడి సింగపూరు ట్రిప్ కాన్సిల్ చేయమని చెప్పాడుట. విశ్శు ఇలా ఉంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కద తరువాత వెడతానులే సింగపూరు మా అక్క దగ్గరకు అని."
అన్నాడు రమేశ్.
"అలాగా.. వాళ్ళిద్దరూ క్లాస్ మేట్స్ కూడా కద.
అయినా విశ్శు మంచివాడు.. అందరికీ సాయం చేయడంలో ముందుంటాడు.
ఇప్పుడేదో మనం వాడికి ఇచ్చాము కాని వాడెన్ని సార్లు బ్లడ్ ఇవ్వలేదు ఎవరికి అవసరమైనా.
నువ్వు నేను అనే తేడాలు ఉండవు వాడి దగ్గర. అలాంటి ఫ్రెండ్లీ నేచర్ తక్కువ మందికే ఉంటుంది."
రవి.
"నేను కూడా ఇప్పుడెక్కడికీ వెళ్ళను.. కొన్నాళ్ళ తరువాత వస్తానని చెప్పేసాను మా పార్టనర్ కి. హాస్పిటల్ లో ఒకరోజు రాత్రి నేను కూడా ఉంటాను."
ఇంకొక ఫ్రెండ్ రాజు అప్పుడే వచ్చి అన్నాడు.
"సరే అయితే. గోవిందు వస్తే మనం నలుగురం. జాగ్రత్తగా చూసుకుందాము.
వాడి దగ్గరే ఉందాము వీలయినంతవరకు. వాడు త్వరగా రికవరీ కావాలి."
దృఢంగా అన్నాడు రవి.
"అవుతాడు బాబు. మీలాంటి ప్రేమించే స్నేహితుల మనసుల ప్రార్థనకు ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.
విశ్శు తప్పకుండా కోలుకుంటాడు. ఖర్చు పెట్టగలం..మంచి మనసులను ఎలా తేగలం..డబ్బు ఒకటే అన్నీ కాదు." అన్నాడు విశ్శు వాళ్ళ నాన్న వీరి మాటలు వింటూ.
సిస్టమ్ ముందు ఉన్న రమేశ్ దగ్గరకు వచ్చాడు రవి.
"రాత్రి విశ్శు దగ్గర ఉంటావురా నువ్వు.."
"అదే చూస్తున్నాను. ఒక క్లయింట్ రమ్మన్నారు ఈవెనింగ్. ఆ పనయితే వెళ్తాను."
"సరే అయితే.. రేపు కాశ్యప్ ఉంటా అన్నాడు."
"హా.. ఏమిటోరా.. ఇంకా ఎన్నిరోజులు ఇలా వాడు.."
"ఏమి చేస్తాము.. వాళ్ళ అమ్మావాళ్ళు చూస్తున్నాము కద ఎంత బాధలో ఉన్నారో."
"అవునురా. ఒకడే కద విశ్శు వాళ్ళకి. పాపము."
"మనకు మాత్రము లేదా.. విశ్శు మనకు ఎంత క్లోజు."
ఇంతలో రమేశ్ ఫోన్ రింగయ్యింది.
గోవిందు.. రవికి చెప్పి ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు రమేశ్.
వారి ఫ్రెండ్ విశ్శు - విశ్వం కార్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ఉన్నాడు.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కాని, మాములు స్ఠితికి రావడానికి చాలా సమయం పడుతుంది అన్నారు స్పెషలిస్ట్ లు.
తల్లీ, తండ్రీ చాలా ఆందోళనలో ఉన్నారు. తలకు మించిన ఖర్చు.. ఒకగానొక్క కొడుకు బాగుంటే చాలు అని అన్ని ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూరుస్తున్నారు. అయినా అంతూపొంతూ కనపడటం లేదు.
ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒకరు ఉండవలసిన పరిస్థితి.
మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉందని ప్రమాదం గురించి వివరాలు చెప్పలేదు.
నాలుగేళ్ళ నుండి హైదరాబాద్ లో మిత్రులు నలుగురూ చిన్న గది తీసుకుని అన్నీ షేర్ చేసుకుంటూ గడుపుతున్నారు.
అందరివీ ఒకమాదిరి పనులే. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు పంపే డబ్బు జాగ్రత్తగా వాడుకుంటూ ఒకరికొకరు అన్నట్లు ఉంటున్నారు.
ముగ్గురు చిన్నప్పటి నుండీ ఫ్రెండ్స్ కాగా.. ఇంకొకరు కాలేజీ మిత్రుడు.
ఎవరికీ అరమరికలు లేవు.
పెద్దలు ఆర్ధికంగా బాగున్న వారే కాని, స్వంతంగా పని చేసుకోవాలనుకునే పిల్లలకు అడ్డు చెప్పకుండా వారి అభిరుచి ప్రకారమే ప్రోత్సాహిస్తూ ఉంటారు.
"గోవిందు అంటున్నాడురా.. వాడి సింగపూరు ట్రిప్ కాన్సిల్ చేయమని చెప్పాడుట. విశ్శు ఇలా ఉంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కద తరువాత వెడతానులే సింగపూరు మా అక్క దగ్గరకు అని."
అన్నాడు రమేశ్.
"అలాగా.. వాళ్ళిద్దరూ క్లాస్ మేట్స్ కూడా కద.
అయినా విశ్శు మంచివాడు.. అందరికీ సాయం చేయడంలో ముందుంటాడు.
ఇప్పుడేదో మనం వాడికి ఇచ్చాము కాని వాడెన్ని సార్లు బ్లడ్ ఇవ్వలేదు ఎవరికి అవసరమైనా.
నువ్వు నేను అనే తేడాలు ఉండవు వాడి దగ్గర. అలాంటి ఫ్రెండ్లీ నేచర్ తక్కువ మందికే ఉంటుంది."
రవి.
"నేను కూడా ఇప్పుడెక్కడికీ వెళ్ళను.. కొన్నాళ్ళ తరువాత వస్తానని చెప్పేసాను మా పార్టనర్ కి. హాస్పిటల్ లో ఒకరోజు రాత్రి నేను కూడా ఉంటాను."
ఇంకొక ఫ్రెండ్ రాజు అప్పుడే వచ్చి అన్నాడు.
"సరే అయితే. గోవిందు వస్తే మనం నలుగురం. జాగ్రత్తగా చూసుకుందాము.
వాడి దగ్గరే ఉందాము వీలయినంతవరకు. వాడు త్వరగా రికవరీ కావాలి."
దృఢంగా అన్నాడు రవి.
"అవుతాడు బాబు. మీలాంటి ప్రేమించే స్నేహితుల మనసుల ప్రార్థనకు ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.
విశ్శు తప్పకుండా కోలుకుంటాడు. ఖర్చు పెట్టగలం..మంచి మనసులను ఎలా తేగలం..డబ్బు ఒకటే అన్నీ కాదు." అన్నాడు విశ్శు వాళ్ళ నాన్న వీరి మాటలు వింటూ.
-------------
వాట్సాప్ కథలు 890 17082024
కథ పేరు: నీ వెనుక
రచన: విమలాప్రసాద్
చిత్రం: లేదు
........
"సుధా అందరూ వచ్చారా.." చుట్టూ ఉన్న వారిని చూస్తూ అడిగింది విజయ.
"హా మేడమ్!" సమాధానం ఇచ్చింది సుధ అనబడే ఉద్యోగి.
సుమారు ఓ పదిమంది దాకా సర్కిల్ లా కూర్చుని ఉన్నారు.
"సరే మొదలుపెడదామా సుధా..
చెప్పండి అందరూ మీ ప్రాబ్లమ్స్ ఏమిటో.
మిగతా వాళ్ళెవరి దగ్గరకు వెళ్ళవు. అనుమానం లేకుండా భయపడకుండా చెప్పండి."
"రమా ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కద చెప్పు ఇప్పుడు" అంది సుధ
"హా మేడం రోజూ అలాంటి చెత్త, డబుల్ మీనింగ్ మాటలు అంటూ ఉన్నారు. భరించలేకపోతున్నాను." అంది రమ.
తను కొంచెం మెల్లకన్ను కానీ సమర్థంగా సమాధానం చెప్పగలదని రిసెప్షనులో ఉంచారు. నలుగురు నాలుగు రకాలు..కొందరు వంకర మాటల వారూ ఉంటారు.
మరొక ఉద్యోగిని సబార్డినేట్ తో వేధింపులు ఉన్నట్లు అందరికీ తెలుసు కానీ కంప్లైంట్ చేయదు. సహనమే రక్షగా అన్న నమ్మకం తనది.
"అస్తమానం తాకుతూ ఉంటారు.. దూరం ఉన్నా, అవసరం లేకపోయినా కావాలనే తగులుతూ మాట్లాడతారు కొంచెం మంది.. ఏంటో.." అసహనంగా అంది సుమన అనే మరో ఉద్యోగిని.
మరో ఇద్దరు ముగ్గురు ఇలాంటివే సమస్యలన్నారు.
అన్నీ వింటూ సానునయంగా స్పందించారు కమిటీలో మిగిలిన మెంబర్లు.
చివరగా విజయ..
"చూడండి అందరూ..ఇప్పుడు ఈ రోజుల్లో అందరం కలిసి పనిచేస్తున్నాము. అందరూ మంచివాళ్ళే ఉండరు నిజమే కాని.. కొంత సహనం అవసరం.
పట్టించుకోకుండా వదిలేస్తే కొందరు మారవచ్చు.
లేదా డైరెక్ట్ గా చెప్పడం చేయవచ్చు.
కొన్ని చోట్ల ఉన్నంత దారుణంగా మన దగ్గర లేనందుకు మనం సంతోషించాలి.
ఎవరైనా ప్రమాదకరంగా ఉంటే తప్పనిసరిగా చర్య, రక్షణ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, ఋజువులు సంపాదించాలి.. రమా నువ్వు కూడా.
మన వెనుక బలం ఉంది, రక్షణ ఉంది కానీ వృధాగా కాకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలి.
మీకు నేనున్నాను.. కమిటీ ఉంది. ధైర్యంగా, జాగ్రత్తగా పనిచేసుకోండి." అని ముగిస్తూ..
"సుధా! మొత్తం సారాంశం womens harassment at working place మీటింగ్ మినిట్స్ తయారుచేసి నా సంతకంతో బాస్ కి హెడ్డాఫీసుకు పంపు" అని లేచింది కమిటీ హెడ్ అండ్ చెయిర్ పర్సన్ విజయ.
------------
వాట్సాప్ కథలు 911 07092024
కథ పేరు :బాల చంద్రుడు
రచన, చిత్రం : విమలాప్రసాద్
.........
తెల్లవారు జామున మొదలయిన పనులు తొమ్మిదికి పూజ పూర్తవడంతో ముగిసాయి.
రకరకాల ఆకులు, పూవులు శుభ్రంగా ఉన్నవి ఎంచి మరీ పూజ చేసి, బెల్లం కుడుములు, తడ వంటకం, ఆవిరి కుడుములు , కొబ్బరి కుడుములు వినాయకదేవునికి ప్రీతి అని అనవాయితీగా చేసే అన్నింటితో నైవేద్యం పెట్టి పూజ ముగించారు.
చిన్న పెద్ద పళ్ళతో కలువ, కొబ్బరి పూల అలంకరణతో పాలవెల్లి కన్నుల నిండుగా ఉంది.
తృప్తిగా చూసుకుంటూ విశ్రాంతిగా కాఫీలు మొదలుపెట్టారు.
ఇంటిపెద్ద విష్ణు ఉద్యోగి.
కొడుకు కృష్ణ, కూతురు సుధ. భార్య కమల.
"దేవుని బొమ్మ పెద్దగా ఉన్నా ఎలాగైతేనేం మట్టిదే దొరికింది కదా" అన్నాడు కృష్ణ.
"అదేమిటి ఎప్పుడూ మట్టిదే తెచ్చుకుంటాము కద" అన్న కమల మాటకు సమాధానంగా.. "హా.. ఆ పక్క రోడ్లో బాగుంటాయని వెళ్ళి తిరిగి తిరిగి మట్టివి కనపడక వస్తుంటే చివరాఖరికి ఇది ఉన్న బండి దొరికింది. అందులో తప్ప అన్నీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వేట. ఎన్ని సైజులో. ఎంత బాగున్నాయో.
అందుకే కొంచెం పెద్దగా ఉన్నా ఇది తెచ్చేసాను."
"మంచి పనయింది. దేవుని బొమ్మ మట్టిది కాకపోతే అందరు అనేవారు.. చవితికి ముందే నిందలు పడేవి నీకు" అంది సుధ.
"అవునూ.. పోయిన సంవత్సరం పక్కింటి చంద్రం బాబు కనిపించలేదని హడావుడి అయ్యింది కద..ఈసారి ఏం చేస్తాడో..మళ్ళీ ఏం సినిమా చూపిస్తాడో వాళ్ళింట్లో" అంది కమల.
"ఏం చేసాడేమిటి పోయిన సంవత్సరం నేను కాంప్ వెళ్ళాను కద నాకు తెలియదు" అన్నాడు విష్ణు.
"అందరూ వినాయక చవితికి చందమామను, చంద్రున్ని చూడకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటే విని డాబా మీద గదిలో గడియ పెట్టుకుని ఉండిపోయాడు రాత్రి పది దాకా."
"ఓరి వీడి తెలివి.. వాడి పేరు చంద్రం అనా!" తెల్లబోయాడు విష్ణు.
"అవును. చిన్నవాడు కద..అవీ ఇవీ విని..అలా అర్థం చేసుకున్నాడు. పాపం అమాయకం."
ఆ సందర్భం గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకున్నారు అంతా.
"అమాయకమే కాని పిల్లలకు బాగా హత్తుకుంటాయి వినాయకునివీ, ఆంజనేయస్వామివీ కథలు."అంది కమల.
"అవును నిజమే" వంత పలికాడు విష్ణు.
----------------------
వాట్సాప్ కథలు 939 05102024
కథ పేరు: సద్వినియోగం
రచన : విమలాప్రసాద్
చిత్రం: లేదు
......
"ఏదయినా మంచి హాస్పిటల్ పేరు చెప్పండి. నా ఆర్గన్స్ డొనేట్ చేస్తాను" అన్నాడు సీతారామయ్య.
"ఇప్పుడెందుకు అవ్వన్నీ..చూద్దాంలే" అన్నాడు రాజారావు.
"లేదురా.. తను పోయినప్పటి నుండీ అనుకుంటున్నాను. అప్పుడేదో కదరలేదు.
ఇప్పుడెలాగైనా ముందే ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి."
సీతారామయ్య రిటైర్డు పోలీసు అధికారి. భార్య చనిపోయి చాలా రోజులయ్యింది. వార్థక్యం, వారసత్వంగా వచ్చిన షుగరు, బిపి లాంటి వాటితో బలహీనంగా మారాడు.
"నీ ఉద్ధేశ్యం మంచిదే కానీ సద్వినియోగం అయ్యేలా చూసుకో.." మరో మిత్రుడు దాశరధి.
"అందుకేగా మీ సహాయం అడుగుతున్నాను."
"ఊరుకోరా నువ్వు మరీ.. ఇలాంటి వాటిలో కూడా మోసాలా!" అన్నాడు రాజారావు.
"మోసం అని కాదు సక్రమంగా ఉపయోగించాలని నా ఉద్ధేశ్యం. హాస్పిటల్సు..వాటి వ్యాపారవ్యూహాలు, ధనార్జనా పద్ధతులు తెలియని విషయాలు కాదు కద."
"అవుననుకో.."
"ఖరీదైన చదువు, ట్రైనింగులు.. నిపుణులే కాని అవసరం అయిన వారు ఎంతో ఖర్చులు భరించగలిగితే కాని వారికి వీరి నైపుణ్యం, పరిష్కారం చేరదు.
ఈ డాక్టర్లు, హాస్పిటల్సు ఎంతమందికి అందుతాయో చెప్పలేము కద. అన్నిచోట్లా డబ్బే."
"నిజమే. మొన్న మా మేనల్లుడు ఒకడు డిప్రెషనులో ఉన్నాడని చూపిస్తే అసలు మెడిసిన్ కి రెండింతలు పవర్ ఉన్నది రాసారు. రియాక్షన్ వచ్చి అర్థం పర్థం లేని వాగుడు. అడిగితే వీడు సైకో అన్నారు. డౌట్ తో నెట్ లో వెతికితే తెలిసింది రాంగ్ ప్రిస్క్రిప్షన్." అన్నాడు రాజారావు.
"ఏం హాస్పిటల్" అడిగాడు సీతారామయ్య.
"ఏదైతేనేం లే..కార్పొరేట్ హాస్పిటలే."
"అంతేలే.. అలా డబ్బుకు ఒక నిశ్చింతకు అలవాటు పడితే ఆ నిర్గక్యం దానంతట అదే వచ్చేస్తుంది.
ఈ హాస్పిటల్సు దోహదపడుతాయి. అందరూ అని కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి ప్రస్తుతం.
అందుకే అంటున్నాను నువ్వు దానం ఇచ్చుకో కాని అంతంత ఫీజులు తీసుకుని ఆపరేషన్లు చేసే హాస్పిటల్సుకో, డాక్టర్లు ఉండే దగ్గరో కాదు సద్వినియోగం అయేలా చూసుకో అనే నే చెప్పేది."
"అవును. ఏ ప్రభుత్వాసుపత్రో అయితే కొంత అవకాశం ఉంది. అలా చెయ్యి."
"సరే అయితే. అలా మంచిది. అవసరమైన వారికి ఎవరికైనా ఉపయోగపడితే నాకూ సంతోషమే, కళ్ళు కూడా. కొంచెం వాకబు చేసి చూడు నువ్వు. నా పరిస్థితి ఇలా ఉంది కద. ఆ పేపర్లేవో సంతకాలు పెట్టేస్తాను."
-----------
వాట్సప్ కథలు 967 02112024
కథ పేరు: చేయూత
రచన : విమలాప్రసాద్
బొమ్మ : లేదు
..........
"చూడు రాజయ్యా.. నువ్విలా చెప్పడం ప్రతీసారి జరిగేదే. అప్పు తీర్చకపోతే బ్యాంకు పైవాళ్ళు
ఊరుకోవడం లేదు. ఇంకా వాయిదా ఇవ్వడం కుదరదు." గొంతులోకి కఠిన్యం తెచ్చుకొంటూ
అన్నాడు లక్ష్మీపతి.
"ఈ ఒకసారే సారు.. ఒక నెల టైము ఇవ్వండి చాలు." ప్రాధేయపడుతూ అడుగుతున్న రాజయ్య చుట్టూ ఉన్న పక్క ఇళ్ళ వాళ్ళు, భార్యా పిల్లలు లక్ష్మీపతి ముఖంలోకే చూస్తున్నారు.
"నాన్నా.. సిఎం టూరు మారిందట. మనూరు రావట్లేదుట." రాజయ్య కొడుకు అప్పుడే లోపలికి వచ్చి చెప్పాడు.
"ఇంకెప్పుడు వస్తారో.. అప్పు ఎప్పుడు తేలుతుందో"
నిస్పృహగా అన్నాడు రాజయ్య.
మెయిన్ బ్రాంచి వాళ్ళ వీడియో మీటింగులో బాస్ హెచ్చరికలు మనసులో మననం చేసుకున్నాడు లక్ష్మీపతి.
"సరే.. ఈ ఒక్కసారి వెడతాను. నెలలోగా క్లియర్ చేయకపోతే నా చేయి దాటిపోతుంది మరి. వసూలుకు యాక్షన్ తీసుకోకతప్పదు." అని లేచి బయటకు వచ్చి కారు ఎక్కాడు.
కారు పరుగెడుతూ ఉంటే లక్ష్మీపతిని ఆలోచనలు చుట్టుముట్టాయి.
అప్పు తీర్చలేక ప్రభుత్వం ఋణమాఫీ చేస్తుంది అని ఎదురుచూస్తూ ఇలా చాలా మంది రైతులు ఉన్నారు.
ఇది మొండి బకాయి. పంటలు సరిగ్గా పండక రైతులు తీసుకున్న ఇలాంటి అప్పులు పెండింగులో పడి అటు బ్యాంకు మేనేజర్లు మానసికంగా వత్తిడికి లోనవుతున్నారు.. కఠినంగా వసూలు చేసి క్లియరెన్సు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు తానెందుకు గట్టిగా అడగలేకపోతున్నాడు మిగతా వారిలా..
జ్ఞాపకాల పొరలలో విజయమ్మ మెదిలింది.
తండ్రికి వేలువిడిచిన చెల్లెలు. కట్నంగా రెండెకరాలు పొలం ఇచ్చి తానే సాగు చేస్తూ దాని మీద ఆదాయం కూతురికే ఇస్తూ వచ్చాడు తాతయ్య. భర్త మద్యానికి బానిస అయి చనిపోతే అప్పులతో చేతిలో డబ్బేమి లేక నలుగురు పిల్లలను పోషించడానికి.. తనకు కట్నంగా వచ్చిన పొలం అమ్మమని అడిగిందని తన పొలం కూడా కలిపి అమ్మేసి కూతురి దగ్గరే ఉండిపోయాడు తాతయ్య. ఆ డబ్బు పెట్టి
చిన్న షాపు పెట్టుకుని కుటుంబం కొన్ని రోజులు సజావుగానే గడిపింది. రానూరానూ చేతిలో డబ్బు అయిపోగా షాపు నడపలేక బ్యాంకు లోను తీసుకున్నారు.
అయినా సంసారానికి ఖర్చులు, షాపుమీద పెట్టుబడి అన్నింటికి సరిపడా ఆదాయం లేక బ్యాంకు అప్పు అలా అలా పెరిగిపోయి వారి వత్తిడి భరించలేక చివరికి వచ్చినంతకు అమ్మేసారు.
నలుగురు పిల్లలతో తినీ తినక, అప్పులతో విజయమ్మ అనే అత్తయ్య కష్టాలు, బాధలు చుట్టాలలో చెప్పుకునేవారు.
అంతవరకే తనకు తెలుసు. చాలారోజులు ఆలోచనలు ఆ చుట్టూ తిరిగేవి చదువుకునే కాలంలో.
ఇప్పటిలా అప్పుడు ఋణమాఫీలు అవీ ప్రభుత్వాలు మొదలుపెట్టలేదు. కనుక ఎంతో మంది నలిగిపోయి ఉంటారు అటువంటి పరిస్థితులలో. మరణాన్ని వెదుక్కుంటూ వెళ్ళిన కొందరు వార్తలలో తెలుస్తూ ఉండేవారు. కాలానికి తలవంచి సాగిపోయే అలాంటి వారికి అన్యాయం జరగకుండా తన వంతు ప్రయత్నంగా ఇలా తనలో వెనుకంజ వేయించే మనస్థత్వం నిలిచిపోయింది.
------------
వాట్సాప్ కథలు 16112024
కథ పేరు : వైద్యం
రచన : విమలాప్రసాద్
చిత్రం : లేదు
.....
"మణెమ్మా..రోజూ లేటుగా వస్తున్నావు..నిన్న మరీ పన్నెండు అయిపోయింది. ఇలా అయితే ఎలా చెప్పు.."
దుకాణంలో యజమాని ముందు తలవంచుకుని నుంచుంది మణమ్మ.
"ఏమిటీ మాట్లాడవు.. మానేస్తావా ఏమిటి.. ఎవరినైనా చూసుకోమంటావా.." రెట్టించి అడిగాడు దుకాణదారు రంగారావు.
"సారీ అయ్యా.. మా నాన్నకు బాగా లేదు. ఆస్పత్రి లో చేర్చడానికి తిరుగుతున్నాను. కొన్ని రోజులు సర్దుబాటు చేయండి సారు. పని తీసేయొద్దు." కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది.
"ఏంటి జబ్బు.. ఆస్పత్రిలో ఎందుకు ప్రాబ్లెము.."
"కాన్సరని చెప్పారు. చేర్చుకోవడానికి ఏవో టెస్టులన్నారు. రెండు హాస్పిటల్సు తిరిగాము కానీ చేయలేదు. ఏవో కారణాలు చెప్తున్నారు."
"డబ్బు ఇబ్బందా ఏంటి."
"లేదయ్యా..మా తమ్ముడు ఆఫీసులో అప్పు తీసుకున్నాడు. ఆ పైన భగవంతుడి దయ."
"సరే మరి. జాగ్రత్త. నాలుగు రోజులు ఎవరినైనా పెడతాను."
ఆ తరువాత కొన్నాళ్ళకి మణమ్మ రావడం మానేసింది. వాకబు చేస్తే వాళ్ళ నాన్న అనారోగ్యంతో ఇబ్బంది పడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది రంగారావుకి.
మణమ్మ జ్ఞాపకాల నుండి తొలగిపోయిన చాలా రోజులకి.. రైల్వేస్టేషన్ లో కనపడితే పలకరించాడు.
"మా ఊరు అరకు వెళ్ళిపోయాము సార్. అక్కడే దొరికిన డాక్టరు మందులేవో వాడాము.
మంచి గాలి, ప్రశాంతము అక్కడి నుండి రానన్నాడు నాన్న. అదేం చిత్రమో.. ఏడాది లోపు పోతాడు అని ఇక్కడ డాక్టర్లు చెప్పిన వాడు..ఐదేళ్ళు బతికి మొన్ననే పోయాడు, ఏ బాధా తెలియకుండానే." అని చెప్పుకొచ్చింది మణమ్మ.
------------
వాట్సాప్ కథలు 995 30112024
కథ పేరు: బాంధవ్యాలు
రచన : విమలాప్రసాద్
చిత్రం : లేదు
...........
షేర్ ఆటో లో వెనుక సీట్లో సర్దుకుని కూర్చున్నాడు సతీష్.
ఒక పదిమంది వరకు ఉన్నారు అందులో. పక్క ఊరికి దూరం అయినా ఆటో వాడు ఒప్పుకోవడంతో అందరు కలిసి బయలుదేరారు.
సతీష్ కి ఆదుర్దాగా ఉంది. బాబాయిని హాస్పిటల్ లో
చేర్చారని పిన్ని ఫోన్ చేయడంతో వెంటనే బయలుదేరాడు.
సన్నగా జల్లు పడుతోంది. అందరూ లోపలికి సర్దుకున్నారు.
బాబాయి గురించి ఆలోచిస్తుంటే ఆకస్మాత్తుగా వారి పక్కింట్లో స్వాతి గుర్తొచ్చింది. తనకు బాగా పరిచయం. ఆ మధ్య భర్త పోయినట్లు తెలిసి ఒకసారి పలకరించి వద్దాం అనుకున్నా కుదరలేదు. ఎలా ఉందో ఇప్పుడు. తను బాబాయి ఇంటికి వస్తూ పోతూ ఉండేది.
బాబాయి ఇల్లు చేరి పిన్ని ఇచ్చిన మంచినీళ్లు తాగుతూ ఉంటే చెప్పింది.. "మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అన్నారురా."
"ఇప్పుడేమయింది.. సడన్ గా ఏమయినా తెలిసిందా.."
"నీకు తెలుసు కద విజయ అమెరికాలో ఉందని.
రమణ బెంగళూరులో ఉన్నాడని.
మొన్న ఒకసారి విజయకి కాల్ చేసారు.
ఏమి మాట్లాడుకున్నారో తెలియదు. డల్ గా అయిపోయారు. ఉదయమే ఇలా జరిగింది."
"ఎందుకు కాల్ చేసారు.. ఏమైన విషయమా.."
"ఏమో మరి.. అప్పుడప్పుడు చేస్తునే ఉంటారు కద.
అవసరాలకు ముందుగానే పంపేస్తూ ఉంటుంది.
అన్నీ తన చదువుకే పెట్టాము కద.. అది ఏదో ఇలా చూసుకుంటూ ఉంటే పెద్దగా ఏమీ సమస్య రాలేదు."
"మరి రమణ.."
"వాడు వాడి ఉద్యోగం వాడి తిప్పలుతో ఉంటాడని వాడితో ఏమీ పెద్దగా కలుపుకోరు. కోడలు మన వైపు పిల్ల కాదుగా.. గుజరాతీలు వాళ్ల పద్ధతులు వేరని దూరంగానే ఉంటున్నాము."
"పెళ్ళికి వచ్చాను కదా. ఆ అమ్మాయి కలుపుగోరుగానే ఉందనిపించింది" అన్నాడు సతీష్.
"హా.. బాగానే ఉంటుంది. వాళ్లవాళ్లు ఉన్నవాళ్లు. అవసరమయితే ఏమైనా చేయగలరు. కాని మీ బాబాయికి ఇష్టం లేదు వాళ్ళు మనవాళ్లు కారని. ఎప్పుడైనా రమణ మాట్లాడితే మాట్లాడటమే.
పక్కింట్లో స్వాతి తెలుసు కదా మళ్ళీ పెళ్ళి చేసుకుంది వాళ్ళ ఆఫీసులో అబ్బాయిని. ఒక్కత్తే ఎన్నాళ్ళు ఉంటుంది. ఆ అబ్బాయి కూడా వేరే మతమేదో. అయినా బాగానే ఉంటారు. మీ బాబాయి మాట్లాడుతునే ఉంటారు."
"సరే..బాబాయిని చూసి వస్తాను.."
"ఉండు.. నేనూ వస్తాను. వెళ్లే టైమయింది."
నీరసంగా ఉన్న బాబాయి చేతిమీద అనునయంగా స్పర్శిస్తూ.. "ఎలా ఉంది బాబాయి.." అంటున్న సతీష్
ని "ఎప్పుడొచ్చావు" అని అడిగాడు చిన్నారావు.
"ఇప్పుడేలే.. ఏమిటి ప్రాబ్లెము.. విజయ అన్నీ చూస్తుంది కద.. వేరే ఏమీ ఇబ్బందులు లేవుగా..
బాధ్యతలు అన్నీ తీర్చుకుని స్తిమితంగా రోజులు గడుపుతున్నావు. విశ్రాంతి తీసుకునే వయసు."
"అవునురా.. కానీ అవసరాలు ఉంటాయి కదా.
వాటి గురించి పట్టించుకోకుండా ఉండలేముగా.
మాట అనడం తేలిక.. ఆధారపడిన వారి చులకనా
భరించాలి కదా. అందుకే గుండె తన నొప్పి బయటపెట్టింది. తరువాత శరీరం వంతు ఏమో.
తుది వచ్చేవరకూ అంతే."
"విజయ ఏమైనా అన్నాదండీ" అడుగుతున్న భార్య వైపు నిర్లిప్తంగా చూసాడు చిన్నారావు..
"అంటే అంటుంది.. ఏం చేయగలం. వదిలేయి."
"బాబాయి.. పట్టింపులు కొంచెం పక్కన పెట్టు రమణని కూడా కొంచెం కలుపుకో. ఇప్పుడు ఎవరూ పెద్దగా మతాలూ అవీ పట్టించుకోవడం లేదు. మనసులు హాయిగా ఉంటే చాలు.
నచ్చకపోతే కొన్ని చూసిచూడనట్టు ఉండు అంతే
మీకూ ఇంకొక తోడు ఉంటుంది." అన్నాడు సతీష్.
"అవునండి.. అలా చేద్దాము. కాదనకండి. వాడూ మన బిడ్డేగా" అంది పిన్ని.
"అలాగే కానివ్వు. ఉండేది ఎలాగూ శాశ్వతం కాదుగా. ఇప్పుడే సిగ్నలందింది కదా."
-----------------------
వాట్సాప్ కథలు 10027122024
కథ పేరు : క్షణికం
చిత్రం : లేదు
....
"నిన్న ఏం జరిగింది అనుకున్నారు.."
అటెండరు సైదమ్మ మాటకు తల తిప్పకుండానే "ఏమయిందేమిటి" అడిగింది సూపరింటెండెంటు స్వాతి.
"మీరూ, మేనేజరు గారూ వెళ్ళాక పాము వచ్చిందండి ఆఫీసులోకి. పద్మమ్మగారు, రాజుబాబు ఉన్నారు."
"పామా..నిజంగానా.. ఎలా వచ్చింది లోపలికి.."
ఆశ్చర్యపోయింది స్వాతి.
"ఏమోనమ్మా .. భలే భయపడ్డాము. పద్మమ్మగారు ఇదుగో ఈ టేబుల్ ఎక్కి కూచున్నారు."
ఆ దృశ్యం ఊహించుకున్న స్వాతికి నవ్వు ఆగలేదు.
"గదంతా తిరిగిందమ్మా అది. ఏం చేయాలో తోచలేదు ఎవరికీ."
"అలాగా.. వెళ్ళిపోయిందా దానికదే.." అడిగింది స్వాతి.
"లేదమ్మా.. ఆ మూల నుండి ఇటు..మళ్ళీ ఆ మూలకు తిరిగింది. రాజుబాబు కర్రతో కొట్టి చంపేశాడు."
గత్తుక్కుమంది స్వాతి.
"అయ్యో పాపం..చంపేసారా!"
"అవునమ్మా.. మళ్ళీ వస్తాదేమో..ఇంకా వస్తాయేమో అని కొట్టేసాడు."
"అయినా చంపేస్తారా..పాపం కదా.."
స్వాతి మనసు పాడయిపోయిందని గ్రహించింది సైదమ్మ.
"ఆ!..అమ్మా అప్పుడేమీ తోచలేదు."
"కొంచెం ఆగితే అదే పోయేది కద.. తరిమితే సరిపోయేది..మంచిది కాదు కూడానూ.."
"పొద్దున్నే పక్క షాపులో ఆయనకు ఎవరో చెప్పారు కాబోలు.. వచ్చి అదే అన్నాడు. పూజ చేయించమని."
"ఏంటో ..ఆలోచన ఉండొద్దా..ముందు వెనక చూసుకోరా.. మళ్ళీ భయపడతారు.." విసుగ్గా అంది స్వాతి.
సైదమ్మ వెళ్ళినా అదే ఆలోచన ఉండిపోయింది స్వాతికి..
ఎక్కువ రోజులు కాలేదు.. నాగులచవితి పూజలు అని స్టాఫ్ అంతా సగం రోజు డ్యూటీకే రాలేదు. అటు పూజ..ఇటు కనిపిస్తే దాడి చేయడం, చంపడం..
దూరంగా తరిమేస్తే వాటి మానాన అవి బతికే రకాలు కొన్ని ప్రాణులు. మనుషులకే ఇంగితం కొరవడుతుంది. క్షణికావేశంతో అనాలోచితంగా తీవ్రచర్యలకు పాల్పడుతూ ఉంటారు.
నిట్టూర్చి పనిలో పడింది.
-----------------
వాట్సాప్ కథలు 1030 04012025
కథ పేరు: వారసత్వం
రచన: విమలాప్రసాద్
బొమ్మ : లేదు
.....
కాఫీ తాగుతూ డాబా గోడ దగ్గర నిలబడి కిందకు చూసాను.
రోడ్డు చివర నుండి నెమ్మదిగా సైకిలు నడుపుకుంటూ పేపర్లు వేసే ఒకడు..సాదా బట్టల్లో, పక్కనే ఇంకొక కుర్రవాడు కొంచెం శుభ్రంగా.. వస్తున్నారు. కింద వాచ్ మాన్ కు రెండు పేపర్లిచ్చి..రెండో వాడితో కాసేపు మాట్లాడి ఒకడు వెళ్లి పోయాడు. రెండో వాడు మా వాడే.. దగ్గరకు వస్తే కానీ తెలియలేదు, పెద్దమ్మాయి కొడుకు. లోపలికి వచ్చిన కాసేపటికి పైకీ వచ్చాడు.
"ఎవర్రా ఆ అబ్బాయి.. వాడితో వచ్చావేమిటి" అడిగాను.
"మా ఫ్రెండు తాతయ్యా, క్లాసుమేటు" అన్నాడు వాడు.
"క్లాసు మేటా..పేపర్లబ్బాయి కదా" అర్థం కాలేదు నాకు.
"అవును..తాతయ్యా. పొద్దున్నే పేపర్లేసి తరువాత స్కూలుకు వచ్చేస్తాడు."
"ఏం..వాళ్ళ అమ్మానాన్నలు లేరా!"
"ఉన్నార్లే.." అని కొంచెం ఆగి..
"నిన్న బజార్లో చూసాం కద రిటైరయిపోయిన స్కూలు అటెండరు ఆదెమ్మ..ఆటో తోలుతోందని.. వీడి నాన్నమ్మే.
పెన్షన్లు రావట్లేదు. వీడిలా పేపర్లు వేసి సాయం చేస్తున్నాడు.." అన్నాడు.
ఇంతలో వాళ్ళమ్మ వచ్చింది.
"ఎవరూ ఆదెమ్మా.. నాకూ తెలుసు. పెద్ద మనసు.
పిల్లలతో పడక ఒకత్తే ఉంటున్నా.. వాళ్ళకు ఏ కష్టమొచ్చినా తాను ఉన్నాను అంటుంది.
ఆ గుణమే ఏమో..ఆవిడ మనవడు కూడా ఇలా ఏదైనా సాయపడదాం అని చూస్తున్నాడు."
అవును..తరాలు మారినా కొన్ని కొన్ని గుణాలు మాయమయి పోకుండా నిలిచి ఉంటాయి ఇలాగే..
-----------
వాట్సాప్ కథలు 1058 122025
కథ పేరు: ఇక చాలు..
రచన: విమలాప్రసాద్
చిత్రం: లేదు
మాటల మధ్యలో చెప్పాడు.. "నా ముందస్తు పదవి విరమణకు దరఖాస్తు ఒకే అయింది. వచ్చే ఏడాది నుండి విశ్రాంతి" అని.
"ఇంకా సర్వీసు ఉండగానే.. ఏమి.."
"ఉందిలే.. ఇప్పటి వరకు చేసింది చాలు అనిపిస్తుంది.
నాన్నగారు పోయాక మొదలైంది..
బలవంతంగానో..మరో దారి లేకనో ..తప్పలేదు."
"నిజమే అనుకో..కాని గవర్నమెంట్ ఉద్యోగం కదా..
చాలామంది కలలు కంటూ ఉంటారు."
"అలాగే ఇప్పటి వరకూ లాగాను. గానుగెద్దు చాలాసార్లు గుర్తు వచ్చింది.
నాకంటూ ఒక జీవితం ఉండాలి అనిపించింది."
"కొన్నాళ్లు సెలవు పెట్టవచ్చు కద."
"అలా కాదు. నాకు నేనే స్వతంత్రంగా బతకాలి. బాధ్యత ఇంక చాలు.
పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళమ్మ గురించి తెలుసు కద..నా ఇష్టానికి అడ్డు రాదు."
"మిగిలిన సర్వీసు పూర్తి చేసేస్తే బాగుంటుంది కద."
"బాగుంటుంది కానీ ఇప్పుడున్న ఓపిక అప్పుడు ఉండవద్దా.. నాకిష్టం లేదు."
"సరేలే..ఇష్టం లేదు అంటే ఇంకేం అంటాము."
"అలాకాదు..ఇన్ని రోజుల సర్వీసు తృప్తిగా చేసాను.
సరిపడా పెన్షన్ వస్తుంది. విశ్రాంతిగా జీవితం ఎంజాయ్ చేయాలని ఉంది."
"అయినా ఉద్యోగం దొరక్క ఎంతమందో కష్టాలు పడుతున్నారు కద. మళ్ళీ కావాలంటే వస్తుందా..ఏ అవసరం వస్తుందో కదా.. డబ్బే ముఖ్యమైనది అయిపోయింది ఇప్పుడు."
"నిజమేలే కానీ డబ్బు కోసమే బతకడం అయిపోయింది. చేతనయినంత దాచాను అవసరాలకు.సరిపోతుంది. ఇంక చాలు అనిపిస్తోంది."
"దగ్గరగా ముప్పై ఏళ్ళుంటుంది అనుకుంటాను సర్వీసు కదూ..గుర్తు చేసుకుంటూ".. గిరి.
"అవును..ఉద్యోగం తప్ప ఇంకేమీ లేకుండా గడిపాను.
చివరికి ఇలాగే అనిపిస్తుంది ఏమో ఎవరికైనా.."
"అవును. టైమంతా ఆఫీసులోనే, ఆఫీసు పనుల్లోనే గడిపే నీలాంటి వారికి సహజమేలే ఈ ఫీలింగు. కానీ ఈ నిర్ణయం తీసుకునే వారూ తక్కువే. ఇతరులకు సాయపడవచ్చు ఒక విధంగా."
"అవును చాలా తక్కువ. కొందరయితే వత్తిడి తట్టుకోలేక.. ఆరోగ్య పరంగా కూడా. నా కారణం మొదటిదే. ఇంకొకరికి ఉద్యోగావకాశం అనే కద నీ ఉద్ధేశ్యం. నిజమే."
"సరే మరి. ఆ రోజు పిలుస్తావుగా.." అని లేచాడు.
"తప్పకుండా.. తరువాత నీలాంటి ఫ్రెండ్సే నా కాలక్షేపం." నవ్వుతూ తానూ లేచాడు.
--------------------