Monday, 18 June 2018

రాలిన

రాలిన ఆకుల కథలే ఇంకా
గుప్పెడు గుండెల అనలపు రోదనలు
పగిలిన ఆశల రుధిర జ్వాలల సెగలు
విరిగే ఎముకల గూళ్ళు
చెదరిన గూడూ
దూరపు ముద్దా
విసిరిన వేటా
నలిగిన బతుకు..
....అనాధ శవం..
కన్నీళ్ళింకని కన్నుల బావులు అవిగో
వ్రాసే రాతల లోతుల
తేలే కలలు
ఒకటే చీకటి
ఒకటే తీతువు 
బాధల బండల
బరువుల కొలతలు
నలిగే బతుకుల
మూలుగుల ధ్వనులు
బెకబెక ఏడుపులు
నూతిలో కప్పలు..
దుర్మార్గపు అంచుల పదునుకు
తెగిపడే గుండెల కేకలు
శవములు లేచే డప్పుల
రోదన ధ్వని
చచ్చిన క్షణములు
వెతికే రాబందు చూపులు
చంపే గొర్రెల మందల గుంపులు
వేసిన అడుగూ
దాగిన గుండూ
సూటిగా సూటిగా
పోనీ పోనీ ముందుకు
మూడో కన్ను భుగభుగలు
నీకయి కురిసే వెన్నెల తేటా
ఊరే జలముల ఊటా
అందేదెప్పుడూ
చుక్కల పక్కనే వెలిగే మిణుకులు
సుఖములు మరిగిన పులులను
బలి ఇచ్చే కత్తులు నూరే రోజులు

ఎముకలు విరిచే
నెత్తురు తాగే
శిశువుకు పురుడు

కేరళ నుండి టాక్సిలో మిట్టమధ్యాహ్నం ప్రయాణం.. కదులాడే పదాలను కూరిస్తే చివరికి 
ఇలా మొదటి నాలుగు లైన్లు తయారయ్యాయి..  ఊరొచ్చాక అదే ఫీల్ మనసులో స్మరిస్తూ
చివరికిలా ఒకరూపంతెచ్చాను.
శ్రీశ్రీ ని అనుసరించినట్లు ఉందంటూ తీసివేతలు ఎన్నో

No comments:

Post a Comment